ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఐసిస్ సానుభూతిపరుల కోసం జాతీయ భద్రతా సంస్ధ.. ఎన్ఐఏ జల్లెడ పడుతోంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 60 ప్రాంతాల్లో అధికారులు బుధవారం ఉదయం నుంచే సోదాలు ప్రారంభించారు. తమిళనాడు లోని కోయంబత్తూరులో గత ఏడాది అక్టోబరు 23 న కారులో సిలిండర్ పేలిపోయి జమీషా మొబిన్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ కేసులో సుమారు 11 మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.
వారిచ్చిన సమాచారం ఆధారంగా ఒక్క తమిళనాడులోనే 40 ప్రాంతాల్లో ఎన్ఐఏ సిబ్బంది ఇంకా అనుమానితులు ఉన్నట్టు భావించి సోదాలు మొదలుపెట్టారు. కోయంబత్తూరు లోని ఉక్కడం, కునియాముత్తూర్ ప్రాంతాల్లో అనేక ఇళ్లను గాలిస్తున్నారు.ఇంకా తిరుచ్చి సిటీ, మైలాదుతుర, తరంగంబాడి వంటి జిల్లాల్లో సిబ్బంది జట్లుజట్లుగా విడిపోయి సెర్చ్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలోని మంగుళూరులో నవంబరు 19 న ఆటో పేలుడు కేసులో ఇద్దరు అనుమానిత టెర్రరిస్టులు గాయపడ్డారు. ఇంటరాగేషన్ లో వారిచ్చిన సమాచారాన్ని పురస్కరించుకుని ఈ రాష్టంలో కూడా అనేక చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో మూడు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో కొంతమంది ఐసిస్ సానుభూతిపరుల ఇళ్ల నుంచి డిజిటల్ పరికరాలను, అనుమానాస్పద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ కుట్ర కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ, దావణగెరె, శివమొగ్గ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కేరళలో ఇంకా నిషిద్ధ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సానుభూతిపరులు ఉన్నారన్న అనుమానంతో .. పలు చోట్ల రెయిడ్స్ కొనసాగుతున్నాయి.