విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. కర్నూలులోని శ్రీలక్ష్మినగర్ లో ఉంటున్న ఆయన ఇంటికి శనివారం ఉదయం ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. ఇంట్లో తనిఖీల తర్వాత విచారణ నిమిత్తం కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు పాణిని రావాలన్నారు. గతంలో కూడా ఆయన ఇంట్లో సోదాలు జరిపారు అధికారులు. కొన్నిపుస్తకాలు, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.
కేరళలో మావోయిస్టులపై నమోదైన ఓ పాత కేసును ఇటీవల ఎన్ఐఏ తమ చేతుల్లోకి తీసుకుందని.. ఆరుగురి పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని అంటున్నారు విరసం నేతలు. పాణితోపాటు వరలక్ష్మి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యుడు ఆంజనేయులు, కేరళ, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, పిడుగురాళ్ల పీఎస్ పరిధిలో రెండేళ్ల క్రితం ఓ కేసులో అరెస్ట్ అయిన చైతన్య అనే విద్యార్థి ఉన్నారని చెబుతున్నారు.
ఈ ఆరుగురిపై నేరపూరిత కుట్ర సహా క్రూర చట్టాలను మోపారని.. వారం క్రితం ఆంజనేయులను మదనపల్లెలో అదుపులోకి తీసుకుని కేరళ తీసుకెళ్లి రెండు రోజులపాటు విచారించి వదిలిపెట్టారని.. అప్పుడే కేరళ కేసులో ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చిందని వివరిస్తున్నారు. ముంచింగిపట్టు కేసును డీల్ చేస్తున్న అనుభవంతో తాజా ఎఫ్ఐఆర్ ను ఎన్ఐఏ బాగా వండివార్చిందని అంటున్నారు. ఈ కేసులో ఉన్న పాణి, వరలక్ష్మిని కేరళ కేసులోనూ ఇరికించారని ఆరోపిస్తున్నారు.
Advertisements
భవిష్యత్తులో మరికొందరిని చేర్చేందుకు వీలుగా ఇతరులు అంటూ ఖాళీని కూడా వదిలిపెట్టారని అంటున్నారు విరసం నేతలు. మహారాష్ట్ర కేంద్రంగా భీమాకోరేగావ్ కేసును సృష్టించి దేశమంతటా భారీ ఎత్తున అరెస్టులకు పాల్పడినట్టే.. ఇప్పుడు కేరళ కేంద్రంగా అదే తరహా ప్రయోగాన్ని మొదలుపెట్టినట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల వ్యక్తులను ఈ కేసులో చేర్చడం సెక్షన్ల తీవ్రతను చూస్తుంటే అవే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.