దాదాపు రెండు నెలల క్రితం లండన్ లోని భారతీయ హైకమిషన్ కార్యాలయంపై జరిగిన ఖలిస్తానీ దాడిపై దర్యాప్తు జరిపేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన బృందం బ్రిటన్ బయల్దేరింది. అయిదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం అక్కడ ఎవరెవరితో ఖలిస్తానీలకు సంబంధం ఉందో కూడా ఇన్వెస్టిగేట్ చేయనుంది. ఓ విదేశీ గడ్డపై ఎన్ఐఏ టీమ్ దర్యాప్తు జరపడం ఇదే మొదటిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
స్కాట్లాండ్ పోలీసులతో కలిసి వీరు దర్యాప్తు జరపనున్నారు. గత మార్చ్ 19 న లండన్ లోని భారతీయ హైకమిషన్ కార్యాలయ భవనంపైగల భారత జాతీయ పతాకాన్ని తొలగించి తమ ఖలిస్తానీ జెండాను ఎగురవేయడానికి ఖలిస్తానీలు యత్నించారు. అయితే హైకమిషన్ సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకుని తిరిగి పెద్ద భారత పతాకాన్ని ఎగురవేశారు.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను హోమ్ శాఖ లోని కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్ డివిజన్.. ఎన్ఐఏకి అప్పగించింది. బ్రిటన్ లోని అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం హోమ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
విదేశాల్లో భారతీయ ఆస్తులపై జరిగే ఉగ్రవాద దాడులపై దర్యాప్తు జరిపేలా ఈ సంస్థకు అధికారాలను అప్పగిస్తూ 2019 లో ఎన్ఐఏ చట్టాన్ని కేంద్రం సవరించింది.