రెండు నెలల క్రితం బెంగళూరులో పట్టుబడిన ఉగ్రవాది జహిదుల్ ఇస్లాం ఇచ్చిన సమాచారం ఎన్ఐఏ బృందాలు కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నాయి. క్రిష్ణగిరి కొండపైనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. గతంలో భారతదేశంలో జరిగిన పలు బాంబు బ్లాస్ట్‌లకు సంబంధించిన సంఘటనల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జహిదుల్ ఇస్లాంను రెండు నెలల క్రితం బెంగళూరు సమీపంలో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిద్దీన్‌కు చెందిన జహిదుల్ ఇస్లాం భారతదేశంలో జరిపిన బాంబ్ బ్లాస్ట్‌కు సంబంధించి క్రిష్ణగిరి కొండపైనే తలదాచుకుని బాంబులు తయారీ చేశాడన్న సమాచారంతో ఎన్ఐఏ ఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 25 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. జహిదుల్ ఇస్లాం బాంబుల తయారీకి సంబంధించి ఉపయోగించిన పలు పైపులు, బ్యాటరీలు, వైర్లు, అదే విధంగా అతనికి సంబంధించిన లగేజీతో పాటు కీలకమెన పలు పేపర్లను ఎన్.ఐ.ఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలో జరిగిన పలు బాంబు బ్లాస్ట్‌లకు ఉపయోగించిన బాంబులను క్రిష్ణగిరి కొండపైన ఉగ్రవాది తయారు చేశారనే విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సరిహద్దు ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు.