నైజీరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నైజర్ డెల్టా ప్రాంతంలో చమురు శుద్ది కర్మాగార సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే మరణాల సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు.
చమురు శుద్ది కర్మాగారం నుంచి చమురును దొంగిలించేందుకు అక్రమ రిఫైనరీ నిర్వాహకులు ప్రయత్నిస్తున్న సమయంలో ఇమోహా ప్రాంతంలో పేలుడు సంభవించిందని స్టేట్ పోలీసు ప్రతినిధి ఇరింగే కోకో తెలిపారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో వారంతా ముడి చమురు ఉత్పత్తులను దొంగిలిస్తున్నట్టు తేలిందన్నారు.
ఈ ఘటనలో ఐదు వాహనాలు, నాలుగు ఆటో-రిక్షాలు, మోటారుసైకిల్ కాలి బూడిదయ్యాయన్నారు. ఇప్పటి వరకు 12 మంది మరణించినట్టు గుర్తించామన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. పైప్‌లైన్ నుంచి చమురును దొంగిలించేందుకు ఐదు వాహనాల్లో వ్యక్తులు అక్కడకు చేరుకున్నట్టు తెలిపారు.
యూత్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ అడ్వకేసీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైన్‌ఫేస్ డుమ్‌నమేన్ మాట్లాడుతూ.. గ్యాలన్ల క్రూడ్ ఆయిల్‌తో నిండిన బస్సును డ్రైవర్ స్టార్ట్ చేసే సమయంలో బస్సు ఎగ్జాస్ట్ పైప్ నుంచి మిరుగులు రావడంతో పేలుడు సంభవించి వుంటుందన్నారు.