నవీన్ హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు నిహారికను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కోసమే హరిహర కృష్ణ . నవీన్ ను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. మొదట కస్టడీలో హరిహర కృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా నిహారికపై కూడా వారు కేసు నమోదు చేశారు.
నవీన్ ని హత్య చేసి ఆ ఫోటోలను హరిహర కృష్ణ ఆమెకు పంపినట్టు వారు వెల్లడించారు. మరో నిందితుడు హసన్ ను కూడా అరెస్టు చేసినట్టు ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు. హత్య విషయాన్ని స్నేహితుడైన హసన్ కు హరిహర కృష్ణ చెప్పాడని, నేరం తరువాత అతడు ఖమ్మం, విజయవాడ, విశాఖ, వరంగల్ వెళ్లాడని పేర్కొన్నారు.
గత నెల 24 న తిరిగి వచ్చి నిహారికను, హసన్ ను కలిశాడని, నవీన్ ను చంపిన చోటుకు ముగ్గురూ వెళ్లారని డీసీపీ చెప్పారు. హత్య విషయం తెలిసినప్పటికీ నిహారిక గానీ, హసన్ గానీ పోలీసులకు ఈ విషయం చెప్పలేదని తెలుస్తోంది.
హత్య జరిగిన తరువాత నిహారిక.. హరిహర కృష్ణ అకౌంట్ కి రూ. 1500 ట్రాన్స్ ఫర్ చేసినట్టు వెల్లడైంది. పైగా నిహారిక తన ఫోన్ లోని వివరాలను డిలీట్ చేసి ఫోన్ టాంపరింగ్ కి కూడా పాల్పడినట్టు స్పష్టమైంది. ఈ ముగ్గురినీ పోలీసులు రిమాండుకు పంపారు.