గని సినిమాపై వరుణ్ తేజ్ తో పాటు టోటల్ టీమ్ చాలా హోప్స్ పెట్టుకుంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా ఇది. పైగా ఇది అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ తొలి సినిమా. ఇలాంటి టైమ్ యూనిట్ కు ఊహించని దెబ్బ తగిలింది. హైదరాబాద్ లోని ఓ పబ్ లో పోలీసులు జరిపిన దాడుల్లో నిహారిక పేరు బయటకొచ్చింది. ఆమె పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి బయటకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు వరుణ్ తేజ్ కు చుట్టుకుంటోంది.
కొద్దిసేపటికి కిందట ప్రెస్ మీట్ పెట్టాడు వరుణ్ తేజ్. గని సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన ప్రెస్ మీట్ అది. సాధారణంగా ఓ సినిమా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎంతమంది మీడియా జనాలు వస్తారో, ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ కు అందకు రెండింతలు మీడియా జనం వచ్చారు. దాని కారణం గని మీద ఉన్న అంచనాలు కాదు. వరుణ్ తేజ్ ను డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రశ్నించడానికి వచ్చారు వాళ్లంతా.
ఇలా గని గురించి మాట్లాడాలనుకున్న వరుణ్ తేజ్ కు, ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారుతోంది. టోటల్ ప్రమోషన్ అంతా డైవర్ట్ అయిపోతోంది. మొదటికే మోసం వస్తోంది.
మొన్నటికిమొన్న రిపబ్లిక్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఆ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ వచ్చారు. సినిమా గురించి మాట్లడకుండా, టికెట్ రేట్లపై, ఆంధ్రా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో రిపబ్లిక్ సినిమాను పట్టించుకున్న నాధుడు లేడు. అంతా పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్స్ వెంట పడ్డారు. అలా రిపబ్లిక్ సినిమా డిస్కషన్ లో లేకుండా పోయింది. ఫలితం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు గని సినిమాకు కూడా అలాంటి ప్రమాదమే పొంచి ఉంది. రిలీజ్ కు ఇంకా 2 రోజులు మాత్రమే టైమ్ ఉంది. సినిమాకు ప్రమోషన్ దక్కుతుందా లేక వ్యవహారం మొత్తం డ్రగ్స్ కేసు వైపు తిరుగుతుందా అనేది చూడాలి. ఇప్పటికే సగం మీడియా వరుణ్ తేజ్ ను పక్కనపెట్టి, నిహారిక వెంట పడుతోంది.