మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఈ క్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మీడియాతో మాట్లాడారు. ప్రీతి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మా ప్రత్యేక వైద్య బృందం ప్రీతికి అత్యున్నత వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు నిర్విరామంగా కృషి చేసింది. కానీ దురదృష్టవశాత్తూ ప్రీతి ప్రాణాలు కోల్పోయిందని అన్నారు.
నిమ్స్ ఆసుపత్రి అనునిత్యం వందలాది మందికి ఎమర్జెన్సీ సేవలు అందించే అత్యున్నత ఆసుపత్రి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా 1219 మంది, ఐసీయూలో 397 మంది, డయాలసిస్ పేషెంట్లు 100 మంది ఉండగా, మరో 100 మంది ఎమర్జెన్సీ సేవల కోసం, మరో 60 మంది సర్జరీ కోసం వేచి ఉన్నారు. దీంతో పాటు పదుల సంఖ్యలో అంబులెన్సుల్లో ఎమర్జెన్సి రోగులు నిమ్స్ కు వస్తుంటారని తెలిపారు.
ఇందు మూలంగా అందరికీ మా అభ్యర్థన..పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి, నిమ్స్ వైద్యులకు, సిబ్బందికి సహకరించాలని, విధులకు ఆటంకం కలగకుండా చూడాలని, తద్వారా పేషెంట్లకు వైద్య సేవలు కొనసాగేందుకు వీలవుతుందనీ ఆయన కోరారు.