– ఐదురోజులుగా రాత్రి పూట కరెంట్ కట్
– వరిపంటకు నీరందక ఎండిపోతోందంటున్నరైతులు
– నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో ఇబ్బందులు
– పంట చేతికి అందే సమయానికి కోత విధించిన అధికారులు
– 15 రోజులు 24 గంటలు ఇవ్వాలని వేడుకుంటున్న రైతులు
– సాంకేతిక లోపాల కారణమే అంటున్న అధికారులు
ఆరుగాలం కష్ట పడి పండించిన పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు కరెంట్ కోత పెట్టి రైతుల కంట కన్నీరు తీసేలా చేస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో.. కరెంట్ కోత విధించడంతో రైతుల కంట నీరు కాలువలై పారుతున్నా ప్రభుత్వానికి పట్టింపులేకుండాపోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇగ నిధులు, నియామకాల సంగతి సరేసరి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా వ్యవసాయానికి రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారని రైతులు వాపోతున్నారు. దీంతో చేతికి అందిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే.. గుండె తరుక్కు పోతోందని రైతులు కంటనీరుపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుతో కంటిమీద కునుకులేకుండాపోతోందని వాపోతున్నారు.
కరెంట్ కోత కారణంగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి, లోలం, అన్సన్పల్లి, ధర్పల్లి మండలంలోని మద్దులతాండ, వాడి, హొన్నజీ పేట్, సిరికొండ మండలంలోని ముషీర్ నగర్, రావుట్ల గ్రామాల్లో పంటకునీరు అందక.. ఎండిపోయిన వరిపోలాలలో పశువులను మేపుతున్నారు కొందరు రైతులు. ఇంకొందరు మాత్రం.. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు కరెంట్ ఉన్న సమయంలోనే జనరేటర్ల సాయంతో మోటర్లు నడుపుతున్నారు.ఎలాగైనా పొట్టకొచ్చిన పంటను కాపాడుకునేందుకు సర్వవిధాలా కష్ట పడుతున్నామంటున్నారు.
కాగా.. ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందనే దైర్యంతో 18 ఎకరాల పొలం కౌలుకుతీసుకున్నామని.. కరెంట్ కోతతో పొలం అంతా ఎండిపోతోందని జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పంట చేతికి వచ్చేంత వరకు ఓ 10 నుంచి 15 రోజులు పాటు 24 గంటల కరెంట్ ఇవ్వాలని కోరుతున్నాడు. కరెంట్ కోత విధించి తమ పొట్ట కొట్టొద్దని వేడుకుంటున్నాడు.
నీరు పుష్కలంగా ఉన్నా.. విద్యుత్ సరఫరాలో అంతరాయానికి ముందే ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దాదాపు 20 ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి అధికారులే కారణమని కర్షకులు ఆరోపించారు. 15 రోజుల క్రితం భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. కనీసం రెండు తడులకు చెరువు నీరు ఇవ్వాలని తహసీల్దార్ ను వేడుకున్నప్పటికీ.. పట్టించుకోలేదని ఆరోపించారు. చెరువులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆయకట్టు పొలాలు ఎండిపోయాయని వాపోయారు. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న తప్పిదమేనని అంటున్నారు బాధిత రైతులు. కాగా.. ఉత్పత్తి తగ్గడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే పగటి పూట మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.