ఇటీవలే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన తెలుగు తేజం, యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభను చూపించే అవకాశం వచ్చింది. కామన్ వెల్త్ క్రీడల్లో పోటీ చేసేందుకు తన బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. అంతే కాకుండా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనాకు కూడా టోర్నీలో బరిలో దిగేందుకు లైన్ క్లియరైంది.
ఈసారి భారత్ తరఫున మొత్తం నలుగురు మహిళా బాక్సర్లు కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొననున్నారు. ఎంపిక విధానంలో భాగంగా హర్యానాకు చెందిన మీనాక్షిపై 7-0 తేడాతో గెలుపొందింది జరీన్. దీంతో ఆమె కామన్ వెల్త్ లో 50 కేజీల కేటగిరీలో పోటీ చేసేందుకు బెర్త్ కన్ఫామ్ అయ్యింది.
ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ… ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచిన తరువాత తాను శిక్షణకు దూరంగా ఉన్నానని తెలిపింది. దీంతో మళ్లీ బౌట్ లో నిలదొక్కుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించిందని… అయినా ప్రత్యర్థిపై గెలవగలిగాను అని చెప్పింది.
Advertisements
ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా 70 కిలోల కేటగిరీలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. వీళ్లతో పాటుగా నీతు గంఘస్ 48 కేజీల విభాగం, జాస్మిన్ లంబోరియా 60 కేజీల విభాగంలో భారత్ తరుఫున బరిలోకి దిగనున్నారు. బర్మింగ్ హమ్ వేదికగా ఈ నెల 18 నుంచి 22 వరకు కామన్ వెల్త్ క్రీడలు జరగనున్నాయి.