సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చాలాసార్లు విన్నాం. సినీ పరిశ్రమలో బడా బాబుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అన్నీ వారి కనుసైగల్లోనే జరుగుతుంటాయని చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు జనం. ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ మరికొద్ది రోజుల్లో కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నిఖిల్.. తన ఆవేదనను వ్యక్తపరుస్తూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
తన సినిమా కార్తికేయ 2కి ఆగస్ట్ 12న రిలీజ్ డేట్ అనేది అంత సులభంగా దొరకలేదని చెబుతూ దాని వెనుక జరిగిన తతంగాలు అన్నీ వివరంగా చెప్పారు. ఈ విషయాలు చెబుతున్న క్రమంలో ఓ రకంగా ఎమోషనల్ అయ్యారు నిఖిల్.
తన సినిమాను ఆగస్టులో విడుదల చేయకుండా ఆపాలని చాలామంది చూశారని నిఖిల్ తెలిపారు. ఆగస్ట్ 12న మా కార్తికేయ 2 సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే కొందరు పెద్దలు అడ్డు పడ్డారని, ఆ డేట్ వద్దని చెప్పారని తెలిపారు.ఇప్పుడైతే మీ సినిమాకు థియేటర్స్ దొరకవు. అక్టోబర్ లేదా నవంబర్‌కి వెళ్లిపోండి అని అన్నారని నిఖిల్ చెప్పారు. అయితే ఆ మాట తనను ఎంతో బాధపెట్టిందని ఆయన పేర్కొన్నారు. అది జరిగాక వారం రోజలు ఏడ్చానని అన్నారు.
అయితే మా నిర్మాతలు విశ్వ ప్రసాద్‌గారు, అభిషేక్‌గారు పట్టుబట్టి ఆగస్ట్ 12న వస్తున్నామని అనౌన్స్ చేశారని చెప్పారు. ఆ రోజున మా సినిమాకు థియేటర్స్ దొరుకుతాయని అనుకుంటున్నానని తెలిపారు.తనకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు కాబట్టే ఇలా చేస్తున్నారా అని ఎంతో బాధగా అనిపించిందని నిఖిల్ అన్నారు. 15 రోజుల నుండి సరిగా నిద్ర కూడా పోవడంలేదని తన సన్నితుల వద్ద నిఖిల్ వాపోతున్నట్లు టాక్.
కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ కార్తికేయ 2 చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.