ఐపీఎల్ తరహాలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ లీగ్‌లో కేరళ జట్టును దక్కించుకున్న నిమ్మగడ్డ ప్రసాద్… ఆటగాళ్ల కోసం సెర్భియా వెళ్లారు. దాదాపు ఎనిమిది నెలల కింద సెర్భియా వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను అక్కడి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. రస్ అల్ ఖైమా అనే చిన్న దేశం జారీ చేసిన ఇంటర్ పోల్ నోటీసుతో సెర్భియా పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పెట్టుబడుల విషయంలో నిమ్మగడ్డ తమను మోసం చేశారని, తమకు రావాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని రస్ అల్ ఖైమా న్యాయపోరాటం చేస్తోంది. అయితే, ఇలాంటి కేసుల్లో భారతీయులు చేసిన మోసాలపై ఇచ్చే ఆయా దేశాల న్యాయస్థానాల తీర్పులను భారత్‌లోనూ అమలు చేయటంపై ఇటీవలే కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది.
గల్ఫ్ దేశాల్లో భారీగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన భారతీయులకు కూడా తమ దేశాల తీర్పులు వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలు ఎంతో కాలంగా భారత ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కానీ అనూహ్యంగా ఇటీవలే కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. అక్కడి దేశాల తీర్పులను ఇండియాలోనూ అమలు చేసుకునే వీలు కలిగింది. దీంతో వేగంగా స్పందించిన రస్ అల్ ఖైమా… నిమ్మగడ్డ నుండి తమకు రావాల్సిన భారీ మొత్తాన్ని రాబట్టేందుకు నిమ్మగడ్డ ఆస్తుల్ని వేలం వేయించేందుకు కూడా రెడీ అవుతోంది.
దాదాపు 2800 కోట్ల వరకూ నిమ్మగడ్డ రస్ అల్ ఖైమాకు బాకీ పడ్డారని ఆ దేశం ఆరోపిస్తోంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో మ్యాట్రిక్స్ అనే కంపెనీ పెట్టి వ్యాపారాన్ని విస్తరించారు నిమ్మగడ్డ. ఆ సమయంలోనే వాన్‌పిక్ అనే ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరుతో రస్ అల్ ఖైమా నుండి నిధులు సేకరించిన నిమ్మగడ్డ, విశాఖలో పరిసర ప్రాంతాల్లోని బాక్సైట్ గనులపై కూడా దృష్టిపెట్టారు. కానీ మారిన పరిస్థితులు, సీబీఐ కేసులతో ఆ రెండు ప్రాజెక్టులు అటకెక్కాయి. కానీ రస్ అల్ ఖైమా నిధులు మాత్రం నిమ్మగడ్డ తిరిగి ఇవ్వలేదన్నది అసలు ఆరోపణ.
ఇప్పటికే నిమ్మగడ్డకు సెర్భియాలో బెయిల్ వచ్చిందని ప్రచారం ఉన్నా… ఈ కేసులో అతి త్వరలోనే రస్ అల్ ఖైమా న్యాయస్థానాల్లో తుది తీర్పు రావొచ్చని తెలుస్తోంది. ఈ కేసులో ఏపీ సీఎం జగన్‌కు సంబంధాలున్నాయని ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.