మార్కెట్లో ప్రస్తుతం నిమ్మ ధరలు రైతులకు ఆశాజనకంగా ఉంటే, కొనుగోలుదారులకి మాత్రం దడ పుట్టిస్తున్నాయి. మార్కెట్లో నిమ్మకాయ అక్షరాలా పది రూపాయిలు!
మార్కెట్‌లో గ్రేడుల ఆధారంగా తయారైన నిమ్మకు కేజీ రూ.60 నుంచి రూ.70ల వరకు ధర పలుకుతోంది. పూర్తిగా పక్వం కాని కాని పిందె పంటకు కేజీ రూ.35 నుంచి రూ.45 వరకు ధర దక్కుతోంది. ఈ ఏడాది ఒకసారి కేజీ నిమ్మ రూ.90 పలికింది. రిటైల్‌గా ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలకు అమ్ముతున్నారు.
మార్కెట్‌లో ఆ రోజు ఎగుమతి డిమాండ్, కాయల నాణ్యత ఆధారంగా ధర నిర్ణయం జరుగుతుంది. దీంతో రోజురోజుకు ధరలో మార్పులు వస్తుంటాయి. అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో నిమ్మకు ఉన్న ధరల ఆధారంగా జిల్లాలలో అమ్మకాలు సాగుతుంటాయి. గత పది రోజుల నుంచి సాధారణ నిమ్మ కిలో రూ.60 వరకు పలికిన ధర ప్రస్తుతం తగ్గుముఖం పట్టి రూ.46కు చేరింది. అయితే నాణ్యమైన పంటకు రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, ద్వారకాతిరుమల, గోపన్నపాలెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిమ్మ కాయలను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఎనిమిది వేల హెక్టార్లలో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఎక్కువగా నిమ్మ ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. పాట్నా, గయా, వారణాసి, కోల్‌కత్తా, రాంచీ, దోలాగఢ్, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ దసరా తర్వాత ఉండదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కాపు తక్కువగా ఉందని, దసరాకు మార్కెట్‌కు మరింత పంట వస్తుందని, ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా.
ప్రస్తుతం వాతావరణం అనుకూలించక ఈ సంవత్సరం నిమ్మకాపు భారీగా క్షీణించిందని రైతులు పేర్కొంటున్నారు. సాధారణంగా నిమ్మకాయలు మే 15 నుంచి ఒకేసారి పంట దిగుబడులు వస్తాయి. ఈ ఏడాది కాపు ఒకేసారి కాకుండా దఫదఫాలుగా దిగుబడి రావడం విశేషంగా రైతులు పేర్కొంటున్నారు. ఏటా ఈ రోజుల్లో రోజుకు 70 నుంచి 80 లారీల నిమ్మ పంట అమ్మకాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 40 నుంచి 50 లారీల సరుకు మాత్రమే వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.