ఏపీలో టిడ్కో ఇళ్ల పంచాయితీ చాలా రోజులుగా కొనసాగుతోంది. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను వైసీపీ సర్కార్ లబ్ధిదారులకు అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది.
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు టిడ్కో ఇళ్లకు సంబంధించి సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వీరాంజనేయులు, పార్టీ కార్యకర్తలతో కలిసి రామానాయుడు సైకిల్ యాత్ర చేస్తుండగా చిన్న అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సైకిల్ పైనుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలికి గాయమైంది.
గాయానికి ప్రథమ చికిత్స అనంతరం మళ్లీ సైకిల్ యాత్రను కొనసాగించారు ఎమ్మెల్యే రామానాయుడు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శింగవరం దగ్గర ఈ ఘటన జరిగింది.