ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేతపురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్యమో లేక తల్లిదండ్రుల ఆలసత్వమో కానీ ముక్కుపచ్చలారని తొమ్మిది నెలల పాప బలైంది. నాగుల చందు, ధనలక్ష్మి దంపతుల తొమ్మిది మాసాల వయసున్న రెండవ కూతురుకి గత కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చీరాలలో ఉన్న ఒక హాస్పిటల్ లో వైద్యం చేయిస్తున్నారు. అయితే వీరికి వేటపాలెం గ్రామం దగ్గరలో ఉండటంతో రెండు రోజుల నుండి బాబా ఫస్ట్ ఎయిడ్ కేంద్రం లో చికిత్స చేయిస్తూ వారు ఇచ్చిన మందులు వాడుతూ వున్నారు.ఈ క్రమంలో చంటిపిల్ల శరీరంలో పలుమార్పులు రావడం గమనించిన తల్లి గతరాత్రి చంటిపిల్లకి పాలు పట్టి మరల మందులు వేసి నిద్ర పుచ్చింది. తెల్లవారి చూడగానే నిర్జీవంగా ఉన్న పాపను చూసి తలిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. జరిగిన సంఘటనపై వారు పోలీసులకు పిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పాపకు వైద్యానికి వాడిన మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం అనంతరం సమగ్ర విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.