ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. టీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేసిన కాసేపటికే రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. కేంద్రానిదంతా వ్యాపార ధోరణి అంటూ విమర్శలు చేశారు.
ఉద్యమిస్తున్న రైతులను చంపి సారీ చెప్పారని.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పే రోజు కచ్చితంగా వస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. అన్నదాతల సమస్యలు పరిష్కరించకుండా మాటలు చెబుతారా? చిత్తశుద్ధి ఉంటే ప్రధాని సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నందుకు తాము రైతు వ్యతిరేకులమా? అంటూ నిలదీశారు.
పీయూష్ గోయల్ మళ్లీ పాత పాటే పాడారని.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యతను రాష్ట్రాలపైకి కేంద్రం నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రమే వడ్లు కొనుగోలు చేయాలంటే ఎలా సాధ్యమన్న ఆయన.. స్టోరేజీ కోసం ఏం వ్యవస్థ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగాన్ని పీయూష్ గోయల్ అవమానించారని అన్నారు. రాష్ట్రంలో వచ్చేదే బాయిల్డ్ రైస్ అంటే ఎంతసేపు ఆయన రా రైస్ ఎంతిస్తారో చెప్పాలని అంటారే తప్ప మరో మాట మాట్లాడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కేంద్రం తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు నిరంజన్ రెడ్డి. ఇక అంతకుముందు పీయూష్ చాంబర్ లో టీఆర్‌ఎస్ నేతలతో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఆ సమయంలో పీయూష్, ప్రశాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరించాలని పీయూష్ చెప్పగా.. ప్రస్తుతం ఉన్న విధానాన్ని రైతుల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మార్చండని పీయూష్ అనగా.. దేవుడు దయ తలిస్తే తప్పకుండా తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్లుగా సమాచారం.