నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశారు. కేసులో నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో చివరి అవకాశంగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22 న ఉదయం ఏడు గంటలక నలుగురిని ఉరి తీయాలని కోర్టు తీర్పు నిచ్చిన రెండు రోజుల తర్వాత పిటిషన్ వేశారు.
”తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థీకృత రాజకీయ పక్షపాత వైఖరిని తొలగించడానికి…ఈ కేసును ఈ గౌరవ న్యాయస్థానంలో సీనియర్ జడ్జీల సమక్షంలో…ఓపెన్ కోర్టులో విచారించాల”ని పిటిషన్ లో వినయ్ శర్మ కోరారు. అంతే కాదు న్యాయ ప్రక్రియ జరుగుతుండగా డెత్ వారెంట్ అనే కత్తి వేలాడకుండా చూడాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉరి అమలుకు తీర్పు వెలువడగానే నలుగురు బోరున ఏడ్చారు. కోర్టు ఆదేశాల వెలువడిన 14 రోజుల్లోగా దోషులు న్యాయపరిహారం పొందవచ్చని తీర్పులో పేర్కొంది. వీరిలో వినయ్ తప్ప మిగతా ముగ్గురు ఇప్పటికే పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టవేసింది.
క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏమిటి..?
హైకోర్టు విధించిన తుది తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసుకునే అవకాశం దోషికి ఉంది. ఈ రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైతే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. న్యాయ ప్రక్రియలో అన్యాయం, అధికార దుర్వినియోగం జరగకుండా చూడడమే ఈ క్యూరేటివ్ పిటిషన్ ముఖ్యోద్దేశం. న్యాయ ప్రక్రియలో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే ఈ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఒక వేళ ఓపెన్ కోర్టులో విచారణ జరగాలని ప్రత్యేకంగా పిటిషనర్ కోరితే తప్ప క్యూరేటివ్ పిటిషన్ ను సహజంగా చాంబర్ లోనే జడ్జీలు విచారిస్తారు. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్టు…జడ్జీ తన వాదనలు విననప్పుడు… జడ్జీలు వాస్తవాలను వెల్లడించనప్పుడు మాత్రమే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే తాను వేసే పిటిషన్ కు ఆధారాలు చూపిస్తేనే పిటిషన్ ను స్వీకరిస్తారు.
ప్రతి క్యూరేటివ్ పిటిషన్ కూడా రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అండ్ అదర్స్ కేసులో 2002 లో సుప్రీంకోర్టు రూపొందించిన నిబంధలన మేరకే విచారణ జరగుతోంది.