దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ హత్య కేసు నిందితుల ఉరిశిక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్భయ దోషులకు వేరు వేరుగా ఉరి తీసేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీమ్ కోర్ట్ విచారణ చేపట్టింది. అయితే తీర్పు వెలువరిస్తున్న సమయంలో జస్టిస్ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి ఆమె పడిపోయారు. దీంతో, కోర్టు హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన ఛాంబర్ కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
మరోవైపు జస్టిస్ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆరోగ్యం బాగోలేకపోయినా కేసు విచారణ నిమిత్తం వచ్చారని చెప్పారు. ఛాంబర్ లోనే ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనికి ముందే దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ ను జస్టిన్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.