శుక్రవారం ఉదయం 5.30నిమిషాలకు నిర్భయ నిందితులను ఉరితీసేందుకు జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగురు దోషులకు ఎటువంటి న్యాయపరమైన అవకాశాలు లేవని కోర్టు చెప్పడంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నలుగురు దోషుల ఉరిశిక్షలను నిలిపివేయాలని కోరిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో వారికి మరణశిక్ష ఖాయమైపోయింది. నిందితులను ఉరితీసేందుకు గాను తలారి తీహార్ జైలుకు చేరుకున్నారు. సరిగ్గా ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా ఇప్పటికే మూడు సార్లు దోషుల ఉరి వాయిదా పడింది.
ఇన్ని సార్లు దోషుల ఉరి వాయిదా పడటంతో ఇప్పటికైనా ఉరి అమలవుతుందా అనే సందేహాల నడుమ కోర్టు కూడా ఉరి అమలు చేయవచ్చని తేల్చి చెప్పింది. ఇప్పుడు దోషుల బంధువులు , కుమారులను రక్షించాలనే ఆశ ఉన్న తల్లిదండ్రులు రోదించడం తప్ప చేసేదేమి లేదు. నలుగురు దోషులలో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కొడుకుకు చివరిసారిగా పూరి, సబ్జి తినిపించాలని కోరుకుంటున్నట్టు సమాచారం. అయితే అధికారులు దీనికి అనుమతి ఇస్తారో లేదో చూడాలి.