తన కూతురు చావును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడ లేదని…కానీ నేను ఈ రోజు చెప్ప దల్చుకున్నాను…2012లో నిర్భయ ఘటనపై రోడ్ల మీద నిరసన వ్యక్తం చేసిన వారే ఈ రోజు కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. నా కూతురును దారుణంగా రేప్ చేసి ఆమె చావుకు కారణమైన వారికి వెయ్యి అవకాశాలు ఇచ్చారని…మాకు మాత్రం ఎలాంటి హక్కులు లేవన్నారు. దోషులకు ఉరి శిక్షను అమలు చేయడంలో నిర్లక్ష్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలను నిందిస్తున్నట్టుగా ఉంది.
ఇటీవల కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ…ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దోషులకు ఉరి శిక్ష ఆలస్యమైందన్నారు. సుప్రీంకోర్టు అప్పీల్ పిటిషన్ కొట్టేసిన వెంటనే ఢిల్లీ ప్రభుత్వం సకాలంలో దోషులకు నోటీసులు ఇచ్చి ఉంటే…ఇప్పటికే ఉరిశిక్ష పడేదని అన్నారు. ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కౌంటర్ ఇచ్చారు. శాంతి భద్రతలను కేంద్రం తమకు అప్పగించి ఉంటే రెండు రోజుల్లోనే నిందితులను ఉరితీసేవాళ్లమన్నారు. ”జవదేకర్ జీ, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు…శాంతి భద్రతల బాధ్యతలు మీ చేతుల్లో ఉన్నాయి…హోం శాఖ మీ చేతుల్లో ఉంది…తీహార్ జైలు డీజీ మీ చేతుల్లో ఉన్నారు…మమ్మల్ని నిందిస్తున్నారు…సున్నితమైన విషయంలో ఇంత నీచ స్థాయికి దిగజారొద్దు ”అని సిసోడియా అన్నారు.