”జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్”…ఎవరైనా బాధితులకు సకాలంలో న్యాయం జరగకపోతే వారికి న్యాయాన్ని తిరస్కరించినట్టు… ”నిర్భయ” కేసులో ఇప్పుడే అదే జరుగుతుంది. ”నిర్భయ” గ్యాంగ్ రేప్ కేసును కింది స్థాయి నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు అన్ని కోర్టులు విచారించి… దోషులుగా తేల్చి…మరణశిక్ష విధించినప్పటికీ…శిక్ష అమలులో మాత్రం ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. ఈ కేసులో మరణశిక్ష పడ్డ నలుగురు దోషులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని శిక్ష అమలు కాకుండా తప్పించుకుంటున్నారు. ఒక పిటిషన్ తర్వాత ఒకటి కోర్టులో వేస్తూ న్యాయ వ్యవస్థనే సవాల్ చేస్తున్నారు. వారి పిటిషన్లతో వారిపై రెండు సార్లు డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు వారి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరించడాన్ని కూడా దోషులు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేశారంటే వారి ఉద్దేశమేంటో స్పష్టంగా అర్ధమవుతుంది.
తాజాగా దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా ఢిల్లీ కోర్టు నాశ్రయించాడు. తాను పిటిషన్ వేయడానికి తన తరపున లాయర్లు ఎవరు లేరని పాటియాలా కోర్టుకు తెలపడంతో కోర్టు అతనికి న్యాయ సహాయకుడిని నియమించింది. ఇది ఇప్పుడు ”జస్టిస్ డినైడ్” అనే యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది.
దోషి పవన్ గుప్తాకు కోర్టు న్యాయ సహాయకుడిని నియమించగానే ఈ కేసుపై ఏడేళ్లుగా న్యాయ పోరాటం చేస్తోన్న ”నిర్భయ” తల్లి ఆశాదేవి కోర్టు హాల్ లోనే ఏడ్చేసింది. ఈ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం సడలి పోతుందని మీడియాతో వాపోయింది. చనిపోయిన నా కూతురుకు న్యాయం జరగడం కోసం ఏడేళ్లుగా తిరుగుతున్నాను…ఈ దోషులు మరణ శిక్షను తప్పించుకోవడం కోసం నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ కోర్టులు ఎందుకు అర్ధం చేసుకోవడం లేదో నాకు తెలియదు అన్నారు. దోషులను వెంటనే ఉరి తీయాలని కోరుతూ ఆమె కూడా పిటిషన్ వేశారు. ”నిర్భయ” తల్లి ఆశాదేవితో పాటు ఉన్న కొందరు మహిళా కార్యకర్తలు కోర్టు బయట ”వుయ్ వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు.
2012 లో ఢిల్లీలో ”నిర్భయ” అనే పారా మెడికల్ స్టూడెంట్ ను కొందరు బస్సులో దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం కదులుతున్న బస్సులో నుంచి బయటకు తోసేశారు. ఈ సంఘటనతో కోమాలోకి వెళ్లిన ”నిర్భయ” దాదాపు 50 రోజులు చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు కఠిన చట్టాలు తేవాలని నిర్ణయించి ”నిర్భయ” చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం కిందనే కోర్టులు నలుగురిని దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. అయితే ఇంత వరకు ఉరిశిక్ష అమలు కాలేదు. ఎవరి పేరు మీదనైతే చట్టం చేశారో ఆ కేసులోనే దోషులకు ఇప్పటి వరకు మరణ శిక్ష అమలు కాలేదు.