పంచాయతీ నిధుల మళ్లింపు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంలో అసిఫాబాద్ జిల్లాకు చెందిన 18 మంది బీఆర్ఎస్ సర్పంచ్‌లు మూకుమ్మడిగా పదవులకు రాజీనామాలు చేశారు.
తాజాగా ఈ విషయంలో నిర్మల్ జిల్లాకు చెందిన సర్పంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మూడు రోజుల్లోగా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 396 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ భార్యల మెడల్లోని పుస్తెలను అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని సర్పంచ్‌లు వాపోయారు. అప్పులు తమకు మిగిలితే అవార్డులు మాత్రం ప్రభుత్వానికి పోతున్నాయని అన్నారు.
కేంద్ర నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని సర్పంచులు గత వారం రోజులుగా ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పై తిరగబాటు చేస్తున్నారు. నిధులు దారి మళ్లింపును తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ మేరకు
రాజీనామాలు చేస్తున్నారు.