కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన సర్పంచ్.. భర్తతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బిల్లుల విషయంలో ఎమ్మెల్యే, ఉప సర్పంచ్ అడ్డుపడుతున్నారని అప్పుల పాలయ్యామని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మరువక ముందే మరో మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్ పంచాయతీకి సర్పంచ్ గా ఉన్నారు రాధ. ఈమె గ్రామ అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి మరీ డబ్బులు ఖర్చు పెట్టారు. అయితే.. అప్పు పెరుగుతోందే గానీ, చేసిన పనికి బిల్లులు రావడం లేదు.
అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాధ. ఓవైపు ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లులకు నిధులు రాక.. ఇంకోవైపు అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
సర్పంచ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు గ్రామస్తులు. గ్రామంలో చేయించిన అభివృద్ధి పనుల బిల్లులకు నిధులు విడుదల చేయాలని సర్పంచ్ కోరుతున్నారు. ఏం చేయాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నానని.. అప్పులు ఇచ్చినవారు తరచూ ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాధ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.