ఫోర్బ్స్ మ్యాగ్జిన్ ”ద వాల్డ్స్ మోస్ట్ పవర్ పుల్ వుమెన్-2019” జాబితాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు చేరింది. జాబితాలో నిర్మలా సీతారామన్ 34 వ స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాగ్జిన్ గుర్తించిన వంద మంది శక్తివంతమైన మహిళలలో నిర్మలా సీతారామన్ ఒక్కరే కొత్తవారు. నిర్మలా సీతారామన్ దేశ మొదటి మహిళా ఆర్ధిక మంత్రి. గతంలో ఆమె రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
2019లో ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, వ్యాపార, ఆధ్యాత్మిక, మీడియా రంగాల్లో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వంద మంది శక్తివంతమైన మహిళలను ఫోర్బ్స్ మ్యాగ్జిన్ ఎంపికచేసింది. ఈ వంద మందిలో మొదటి పేరు జర్మన్ ఛాన్స్ లర్ ఎంజెలా మెర్కెల్ ది కాగా…రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీనా లగార్డే, మూడో స్థానంలో అమెరికా ప్రతినిధుల సభకు చెందిన నాన్సీ పెలోసీ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా 29 వ స్థానంలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ కాకుండా ఇంకా ఈ జాబితాలో పేరు దక్కిన భారతీయుల్లో హెచ్.సి.ఎల్ కార్పోరేషన్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోష్ని నాడార్ మల్హోత్రా, బయోకాన్ ఫౌండర్ కిరణ్ మంజుందార్ షా లున్నారు.