కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూరగాయల మార్కెట్లో సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. స్వయంగా ఆమె మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొన్న వార్త నెట్టింట వైరల్ అయ్యింది. నిత్యం రాజకీయ, ఆర్ధిక పరమైన పనులతో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్నారు. ఈ విషయాన్ని ఆమె కార్యాలయ సిబ్బంది ట్విట్టర్ లో షేర్ చేశారు.
During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
చెన్నై నగరంలోని మైలాపోర్ ఏరియాలోని ఓ కూరగాయల మార్కెట్ కు నిర్మలా సీతారామన్ వెళ్లారు. మార్కెట్ అంతా కలియ తిరుగుతూ అక్కడి కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. వ్యాపారం ఎలా నడుస్తోందని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కందగడ్డ, కాకరకాయలతో పాటు మరికొన్నింటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నిర్మల మండిలోని కూరగాయల వ్యాపారులతో కూడా మాట్లాడారు.
దేశంలో కూరగాయల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతం నుంచి ఆగస్టులో 7 శాతానికి పెరిగింది. ఆహార ధరల పెరుగుదల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసింది.
అయితే నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లి కూరగాయాలు కొనడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ప్రజలకు నిత్యావసర సరుకులైన కూరగాయలపై కేంద్ర మంత్రి దృష్టి పెట్టినట్లున్నారని కొంతమంది అంటుండగా, నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి మార్కెట్ కు వెళ్లినట్లున్నారని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొంతమంది నెటిజన్లు ఓ ఆర్థిక మంత్రే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లను ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్నింటి పైనా జీఎస్టీ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తూ బాదుతున్న కేంద్ర ఆర్థిక శాఖ.. ఇప్పుడు కూరగాయాల పైనా జీఎస్టీ విధిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా నిర్మాలా సీతారామన్ మార్కెట్ కు వచ్చి ఇలా కూరగాయలు కొనడం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.