యంగ్ హీరో నితిన్ “జయం” వంటి విజయవంతమైన సినిమాతో కెరీర్ మొదలెట్టినా, ఆ తర్వాత చేసిన చిత్రాల్లో ఒక్క “దిల్” తప్ప దాదాపుగా అన్నీ నిరుత్సాహాలే. అలాంటి గడ్డుకాలంలో “గుండె జారి గల్లంతయిందే” సినిమా సక్సెస్ రావడంతో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు. ఆ తర్వాత తన కెరియర్ గాడిలో పడినట్టనిపించినా, మళ్ళీ గతేడాది ఎందుకనో చేసిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కలిసి రాలేదు. వాటిపై భారీగా ఆశలు పెట్టుకున్న నితిన్ ఆ రెండూ పరాజయం పాలవడంతో బాగా డిసప్పాయింట్ అయిపోయాడు.
ఇప్పుడూ తాజాగా ఆచితూచి అడుగులేస్తూ వరుసగా మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు నితిన్. నాగశౌర్య కూ ఛలో లాంటి మంచి సక్సెస్ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న “భీష్మ” చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఓ వైపు ఆ సినిమా పూర్తయ్యేలోపే తన నెక్స్ట్ సినిమా అయిన “రంగ్ దే” పట్టాలేక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మెగాహీరో వరుణ్ టెజ్ కు మరచిపోలేని సక్సెస్ అందించిన “తొలిప్రేమ” దర్శకుడు వెంకీ అట్లూరి ఆ సినిమా చేస్తున్నారు. అందులో “మహానటి”తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేశ్ హీరోయిన గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంగీతం రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు దర్శకుడు వెంకీ, పాటల రచయిత శ్రీమణిలతో కలిసి దేవి.
నితిన్ కెరియర్ లో దేవి సంగీతం అందిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం ఓ విశేషం. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నితిన్ “దేవితో ఇదే నా ఫస్ట్ ఫిల్మ్, ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది, తన పాటలు వినాలని ఆతృతగా ఉంది” అంటూ ట్వీత్ ద్వారా పంచుకున్నాడు. రంగ్ దే సినిమా తర్వాత నితిన్ మరో క్రేజీ కాంబినేషన్ లో వర్క్ చేయబోతున్నాడు. క్రేజీ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఆ సినిమాకు దర్శకుడు. మొత్తానికి ఇలా మూడు వరుస ప్రాజెక్టులతో, తన కెరియర్ ఖచ్చితంగా మళ్లీ ట్రాక్ ఎక్కుతుందని ఆశలు పెట్టుకున్నాడు నితిన్.