యంగ్ హీరో నితిన్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా చెక్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చెస్ గేమ్ తో జైలు నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, ప్రియా వారియర్ కూడా నితిన్ తో రొమాన్స్ చేసింది.
డైరెక్టర్ రాజమౌళి, హీరో ఎన్టీఆర్ లు స్వయంగా ప్రమోట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే….
జీవితకాలం జైలు శిక్ష పడిన ఖైదీగా నితిన్… తనను రక్షించేందుకు లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్, తన గతంలో ప్రేమాయణం… జైల్లో చెస్ గేమ్ ఆడుతూ ఎత్తుకు పైఎత్తులు వేయటం… తనను తాను నిర్ధోషి అని నిరూపించేందుకు ప్రయత్నించిన తీరుతో సినిమా కథ ఉంటుంది.
గత సినిమాలకు భిన్నంగా ఎప్పుడూ సీరియస్ గా ఉండే రోల్ లో నితిన్ కొత్తగా కనిపించాడని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే క్యారెక్టర్ ను నితిన్ సరిగ్గా చేయగలిగాడు. ఒకటి రెండు చోట్ల మినహా నితిన్ పూర్తి యాక్షన్ మోడ్ లోనే ఉన్నాడు. సీనియర్ యాక్టర్ సాయిచంద్ ఎప్పటిలాగే తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా లాయర్ పాత్రకు సరిపోయినా… ప్రియా వారియర్ డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
సినిమాను ఫస్ట్ హాఫ్ నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రీ ఇంటర్వెల్ సీన్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. కానీ కొన్ని లాజిక్ లేని సీన్స్, కన్విన్స్ చేయలేని క్లైమాక్స్, సెకండ్ హాఫ్ మాములుగా ఉన్నట్లు అనిపిస్తుంది. హాలీవుడ్ మూవీస్ చూసే అలవాటున్న జనానికి పెద్దగా ఎక్కే సినిమా కాదని చెప్పుకోవచ్చు.