స్టార్ హీరోతో నిత్యా మీనన్ పెళ్లి అంటూ తెగ ప్రచారం సాగుతోంది. దీంతో ఆమె స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
“నిన్నటి నుంచి నా పెళ్లి అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టానని.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది నిత్యామీనన్.
ప్రస్తుతం నిత్య వయసు 34 ఏళ్లు. ఎట్టకేలకు పెళ్లిపై మనసు పారేసుకుందని వార్తలు వచ్చాయి. మలయాళీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో నిత్య పెళ్లి జరగనుందని ప్రచారం సాగింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీళ్లిద్దరూ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారని.. తమ ప్రేమను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు ఇటీవల ఇరు కుటుంబసభ్యులకు పెళ్లి విషయాన్ని వివరించినట్లుగా కథనాలు వచ్చాయి. త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ.. అందులో నిజం లేదని తేల్చేసింది ఈ బ్యూటీ.
అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నిత్యామీనన్. ఆ మూవీ హిట్ కావడంతో వరుస అఫర్లు వచ్చాయి. కానీ.. పద్దతి గల సబ్జెక్ట్స్ కే ఓకే చెప్తూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిచుకుంది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోని సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
8 సంవత్సరాల వయసులోనే ద మంకీ హు న్యూ టూమచ్ అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటన మొదలుపెట్టింది నిత్య. 17 ఏళ్ల వయసులో ఓ కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది. ఎక్కువగా మలయాళీ సినిమాలు చేసింది.