నీతి ఆయోగ్ పై సీఎం కేసీఆర్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకందని ప్రశ్నించారు. ఏం ఉపయోగమంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆదివారం జరిగే మీటింగ్ ను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.
అజెండా తయారీలో రాష్ట్రాల సహకారం లేదని కేసీఆర్ చేసిన విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆదివారం సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. గతేడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయని గుర్తు చేసింది.
కేంద్రం రాష్ట్రాలకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తుందని పథకాల కేటాయింపులు 2015-16లో రూ.2 లక్షల 3 వేల 740 కోట్లుగా ఉండగా.. 2022-23 కి రూ.4 లక్షల 42 వేల 781 కోట్లకు చేరుకున్నాయని వివరించింది. జలజీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయించామని.. కానీ తెలంగాణ కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఉపసంహకరించుకుందని తెలిపింది.
తెలంగాణ సీఎం ఆరోపణలు అర్థరహితమని కొట్టివేసింది. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసమే సంస్థ ఏర్పాటైందని.. పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించినా కేసీఆర్ స్పందించలేదని పేర్కొంది. నీతి ఆయోగ్ భజన మండలిగా మారిందని.. సమావేశంలో ముఖ్యమంత్రులు మాట్లాడటానికి నాలుగు నిమిషాల సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. ఈ క్రమంలోనే నీతి ఆయోగ్ వివరణ ఇచ్చింది.