నీతి అయోగ్ టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక సూచనలు చేసింది. దేశంలోని నేలల్లో సేంద్రీయ పదార్థాలు క్షీణిస్తున్నాయని కమిటీ పేర్కొంది. ఈ సమస్యను తగ్గించేందుకు వ్యవసాయంలో మొక్కలకు పోషక పదార్ధంగా ఆవు పేడ, ఆవు మూత్రాన్ని ఉపయోగించాలని సూచించింది.
ఆవు పేడ ఆధారిత సేంద్రీయ ఎరువులతో రసాయన ఎరువులను ఏకీకృతం(ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ వలే)చేసే అవకాశాలపై పరిశీలించాలని కూడా నీతి అయోగ్ సభ్యుడు రమేష్ చంద్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసులు చేసింది.
‘గో శాలల ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగు పరచడంపై ప్రత్యేక మైన దృష్టి సారిస్తూ ఆర్గానిక్, బయో ఫెర్టిలైజర్ల ఉత్పత్తి, వాటి ప్రచారం’పేరిట కమిటీ ఓ నివేదికను అందజేసింది. ఈ నివేదికలో టాస్క్ ఫోర్స్ కమిటీ పలు కీలక సిఫారసులను చేసింది.
దేశ నేలల్లో సేంద్రీ య పదార్థాలు లోపిస్తున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్గానిక్ ఎరువులను ఉపయోగిస్తూ పోతే నేలలో సేంద్రీయ పదార్థాలు పెరిగే అవకాశం లేదని పేర్కొంది. దీంతో పాటు రాబోయే రోజుల్లో దేశం తీవ్రమైన సుస్థిర సవాళ్లను ఎదుర్కొనుందని తెలిపింది.
ఆవు పేడకు సంబంధించిన ఎరువులను ప్రోత్సహిస్తూ పోతే అది భవిష్యత్‌లో వ్యవసాయ స్థిరత్వాన్ని పెంచుతుందని పేర్కొంది. దీంతో పాటు గోశాల ఆర్థిక వ్యవస్థను పెంచడంతో పాటు వ్యవసాయంలో సహజత్వాన్ని పెంపొందించుతుందని చెప్పింది.
అందువల్ల ఆవు పేడ, గో మూత్రాలను మొక్కలకు పోషకాలుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలని సూచించింది. ఇనార్గానిక్, ఆర్గానిక్ ఫర్టిలైజర్లను కొంత నిష్పత్తిలో తయారీ సంస్థలను, విక్రయిదారులు అమ్మేలాగా నూతన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది.
గోశాలల ద్వారా ఉత్పత్తి చేయబడిన సేంద్రీయ, బయో ఎరువులను మార్కెట్ చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసులు చేసింది. ఆవు పేడ ఆధారిత సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ప్రోత్సహక చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.