కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కర్ణాటక లోని బెళగావి లో జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులు కనుగొన్నారు. ఈ కాలర్ ఆచూకీని కనుగొన్న నాగ్ పూర్ పోలీసులు.. ఇతడ్ని జయేష్ కాంతగా గుర్తించారు. పేరు మోసిన ఈ గ్యాంగ్ స్టర్ ఓ హత్యకేసులో నిందితుడు. జైల్లో అక్రమంగా ఓ ఓ ఫోన్ ద్వారా ఇతడు గడ్కరీ కార్యాలయానికి ఫోన్ చేసి.. చంపతానని బెదిరించాడని నాగ్ పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు కోసం ఇక్కడి నుంచి పోలీసు బృందం బెళగావికి వెళ్లిందని, జయేష్ కాంతను తమకు అప్పగించాలని కోరనుందని ఆయన చెప్పారు. తనను దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందినవాడిగా చెప్పుకున్న ఈ గ్యాంగ్ స్టర్ .. 100 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్టుగా కూడా ఆయన వెల్లడించారు.
ఖమ్లా ఏరియాలోని గడ్కరీ కార్యాలయానికి నిన్న ఉదయం 11.25- ఆతరువాత 12.30 గంటల మధ్య మూడు బెదిరింపు కాల్స్ అందాయి. ఈ గ్యాంగ్ స్టర్ ..తన మొబైల్ నెంబర్ ని, అడ్రస్ ని కూడా షేర్ చేస్తూ.. అక్కడికి డబ్బు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. ఈ సొమ్ము అందకపోతే గడ్కరీపై బాంబు వేసి హతమారుస్తానని బెదిరించాడట..
ఈ పరిణామాలతో గడ్కరీ కార్యాలయం వద్ద పోలీసు భద్రతను పెంచారు. జయేష్ కాంత నుంచి ఓ డైరీని జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగ్ పూర్ పోలీసులు.. కర్ణాటక పోలీసులతో బాటు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.