బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తానే ఎప్పుడూ అధికారంలో ఉండాలని సీఎం నితీశ్ కుమార్ అనుకుంటున్నారని ఆయన అన్నారు. తన కన్నా తెలివైన వ్యక్తులు అధికారంలోకి రావడాన్ని ఆయన ఇష్టపడరని చెప్పారు.
2025 ఎన్నికల తర్వాత సీఎం కాలేనని నితీశ్ కుమార్ ముందే ఊహించారని అందుకే ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంచుకున్నారని ఆయన ఆరోపించారు. తేజస్వి యాదవ్ సీఎం అయితే ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన పేర్కొన్నారు.
అప్పుడు తేజస్వీ పాలనతో ప్రజలు విసిగిపోయి మళ్లీ తనకే పట్టంగడుతారని నితీశ్ ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం పదవి నుంచి బీజేపీ తనని తొలగిస్తుందని నితీశ్ కుమార్ ముందే పసిగట్టారని చెప్పారు. అందుకే 2020 మార్చిలో తనతో మహాకూటమి గురించి మాట్లాడారన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మహాకూటమి ఏర్పాటు అవసరమని నితీశ్ తనతో అన్నారని చెప్పారు. అందులో చేరాలని తనను కూడా నితీశ్ అడిగారని చెప్పారు. ఈ నెల మొదట్లో కూడా నితీశ్‌కుమార్‌పై పీకే విమర్శలు చేశారు. అధికార కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వ్యాఖ్యానించారు.