ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రశాంత్ కిషోర్, నితీష్ కుమార్ భేటీ అయ్యారు. అప్పటినుంచి ఆయన్ను ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
నిజానికి నితీష్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీకి తక్కువ సీట్లే వచ్చినా.. బీజేపీ త్యాగం చేసి ఆయన్నే సీఎంగా కొనసాగించింది. అయితే.. కొన్నాళ్లుగా రెండు పార్టీల మధ్య సఖ్యత చెడిందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇదే క్రమంలో నితీష్ ను పీకే కలవడం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి నితీష్ కుమారే అనే కథనాలు ఊపందుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థి ఎంపికపై అన్ని పార్టీల నాయకులు చర్చించుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. అయితే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటేనే నితీష్ కు ఛాన్స్ ఉంటుందని చెప్పారు.
మరోవైపు తనపై వస్తున్న వార్తలపై నితీష్ కుమార్ స్పందించారు. తనకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని తేల్చారు. ఇటు జేడీయూ నేతలు మాత్రం నితీష్ రాష్ట్రపతి కావాలని బలంగా కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆయన లాంటి బడా నేతపై ఇలాంటి చర్చ జరగడం సహజమేనని వారు చెబుతున్నారని అంటున్నారు. మొత్తంగా జేడీయూ తీరు చూస్తుంటే ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించేలా లేదని.. నితీష్ కు రాష్ట్రపతి అయ్యే అర్హత ఉందనే విషయాన్ని ప్రమోట్ చేయాలని చూస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.