2024 ఎన్నికల్లో బీజేపీ, మజ్లీస్ పార్టీల పట్ల ముస్లిములు అప్రమత్తంగా ఉండాలని బీహార్ సీఎం, జేడీ-యు అధినేత నితీష్ కుమార్ హెచ్చరించారు. ముస్లింల ఓటు బ్యాంక్ చీలకుండా చూసేందుకు ఆయన ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ, ఎంఐఎం రెండూ మత సామరస్యాన్ని భంగపరచడానికి యత్నిస్తాయని ఆయన ఆరోపించారు.
నిన్న తన అధికారిక నివాసంలో ముస్లిం నాయకులతో సమావేశమైన ఆయన.. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ ‘చురుగ్గా’ పావులు కదుపుతుందని, అందువల్ల విచ్చిన్న శక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లీస్ పార్టీని ఆయన బీజేపీ..’బీ’టీమ్ పార్టీగా అభివర్ణించారు. మతసామరస్యాన్నిభంగపరిచేలా ఒవైసీ విద్వేష పూరిత ప్రసంగాలు చేసే ప్రమాదం ఉందని నితీష్ కుమార్ అన్నారు.
2020 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం.. పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టిందని, దాంతో ముస్లిం ఓట్లు చీలిపోయాయని ఆయన గుర్తు చేశారు. చీలిపోయిన ఓటు బ్యాంక్ కారణంగా 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించవచ్చునన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు నితీష్ కుమార్ యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్, ఎన్సీపీ, ఆప్, జేడీ-యు సెక్యులర్, సీపీఎం పార్టీలను కలుపుకుని పోయేందుకు ఆయన కొన్ని నెలల క్రితం నుంచే యత్నాలు ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో విపక్ష ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉంటారని లోగడ ప్రతిపక్ష నేతలు ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇలా నిలబెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇటీవల కోరారు. ఇందుకు తనకు అభ్యంతరం లేదని నితీష్ కుమార్ అప్పుడే ప్రకటించారు.