బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. పాట్నాలోని గంగా ఘాట్ల పరిశీలనకు వెళ్లగా ఆయన ప్రయాణిస్తున్న పడవ ఓ పిల్లర్ ను ఢీ కొట్టింది.
దీంతో సీఎం నీతీశ్ స్వల్పంగా గాయపడ్డారు. రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో చఠ్ పూజా వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో వేడుకల కోసం గంగా నదిలోని ఘాట్లను పరిశీలించేందుకు ఆయన పాట్నాకు వెళ్లారు. అధికారులతో కలిసి ఆయన పడవలో ఘాట్ లను సందర్శించారు.
ప్రతి ఏడాది ఛఠ్ పూజలకు ముందు గంగా ఘాట్లను సీఎం నీతీశ్ స్వయంగా పర్యవేక్షిస్తు వస్తున్నారు. దీపావళి పండుగ తర్వాత ఆరు రోజులకు ఛఠ్ పూజా వేడుకలను జరుపుకోవడం రాష్ట్రంలో సాంప్రదాయంగా వస్తోంది. ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు సాగుతాయి.
ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో భక్తులు నదీ స్నానాలు చేస్తారు. మహిళలు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. నీటిలో నిలబడి సూర్య నారాయణస్వామికి ప్రసాదాన్నిభక్తులు నివేదిస్తుంటారు. ఆ తర్వాత నీటితో, క్షీరముతో అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ నెల 30న ఛఠ్ పూజలు ప్రారంభం కానున్నాయి.