2-3 సినిమాలు చేసినోళ్లే తమకంటూ ఓ బిరుదు పెట్టుకుంటున్నారు. ఏదో ఒక స్టార్ అంటూ ట్యాగ్ తగిలించుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న సుధీర్ బాబు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి బిరుదు తగిలించుకోలేదు. అతడి సినిమాల్లో టైటిల్ కార్డుల్లో కేవలం సుధీర్ బాబు అని మాత్రమే పడుతుంది. అలా ఎలాంటి ఇమేజ్ లేకుండా ఉండేందుకు ప్రయత్నించిన ఈ హీరో, ఎట్టకేలకు తనకంటూ ఓ ట్యాగ్ సంపాదించాడు.
సుధీర్ బాబు ఇప్పుడు నైట్రో స్టార్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థ ఇతడికి ఈ ట్యాగ్ ఇచ్చేసింది. నిన్న సుధీర్ బాబు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా హర్షవర్థన్ దర్శకత్వంలో ఇతడు చేస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేశారు. అందులో నైట్రో స్టార్ సుధీర్ బాబు అనే పేరును తొలిసారి ప్రస్తావించారు.
ఇకపై సుధీర్ బాబు సినిమాల్లో నైట్రో స్టార్ అనే ట్యాగ్ కనిపించబోతోంది. అతడు చేస్తున్న ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ ట్యాగ్ ను ఆల్రెడీ ప్రచారంలోకి తెచ్చేశారు. అయితే దీని అర్థం ఏంటనేది మాత్రం ఎవ్వరూ ఇప్పటివరకు బయటకు చెప్పలేదు.
మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ లాంటి పదాలకు అర్థాలు అక్కర్లేదు. అవి పాపులర్ ట్యాగ్స్. కానీ నైట్రో స్టార్ అనేది కొత్తగా ఉంది. ఈ నైట్రో పదానికి అర్థం ఏంటో చెబితే బాగుండేది.