ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు గోల్డ్ మెడల్ దక్కింది. ఢిల్లీలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023లో నీతూ గాంగాస్ విజేతగా నిలిచింది. 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్ సాయిఖాన్ అల్టాంట్ సెట్ సెగ్ ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణం పతకం గెలిచింది.
ఫైనల్ మ్యాచ్ లో నీతూ మొదటినుంచీ ప్రత్యర్థిపై పంచులతో విరుచుక పడి పూర్తి ఆధిపత్యం సాధించింది. నీతూ గోల్డ్ మెడల్ సాధించటంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ టోర్నీలో బంగారు పతకం సాధించిన ఆరో మహిళా బాక్సర్ గా నిలిచింది.
అంతకుముందు భారత్ కు చెందిన మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటివరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నీతూ చేరింది.
హర్యాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం నెగ్గి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2023లో దూకుడు ప్రదర్శించి గోల్డ్ మెడల్ ను దక్కించుకుంది. వరుసగా మూడు బౌట్లలోనూ ప్రత్యర్థిని నాకౌట్ చేసి సెమీస్ చేరింది నీతూ.