యువ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో, సక్సెస్ లతో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ ఉగాదికి దాస్ కా ధమ్కీ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాక దర్శకత్వం, నిర్మాణం కూడా విశ్వక్ చేయడం గమనార్హం. గతంలోనే విశ్వక్ ఫలక్‌నామా దాస్ అనే సినిమా కూడా అతనే హీరోగా దర్శకత్వం చేశాడు. ఇప్పుడు మరోసారి హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా దాస్ కా ధమ్కీ కోసం బాగా కష్టపడ్డాడు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ఉగాదికి భారీగా రిలీజ్ చేస్తున్నాడు విశ్వక్. ఈ సినిమాలో నివేద పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా హీరోయిన్ నివేదా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ విశ్వక్ ఈ సినిమా తర్వాత దర్శకత్వం ఆపేయాలి అంటే నివేదా మాత్రం విశ్వక్ స్టార్ డైరెక్టర్ అవుతాడు అని అంటోంది.
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోలు సినిమాలని నిర్మించడం నేను చూశాను కానీ దర్శకత్వం చాలా తక్కువ. విశ్వక్ ఈ సినిమాకు దర్శకత్వం అన్నప్పుడు మొదట నేను భయపడ్డా. కానీ నాలుగు రోజులు షూటింగ్ కి వెళ్ళాక విశ్వక్ మంచి డైరెక్టర్ అవుతాడు అని అనిపించింది. నేను చూసిన దర్శకులలో త్రివిక్రమ్ సర్ తర్వాత అంత ఎనర్జీగా విశ్వక్ ని చూశాను. నేనైతే విశ్వక్ ని ఈ సారి దర్శకత్వం చేస్తే వేరే హీరోతో చెయ్యి అని చెప్పాను. బాలకృష్ణ లాంటి హీరోతో తాను సినిమా చేస్తే బాగుంటుంది.
విశ్వక్ దగ్గర చాలా కథలు, చాలా ఆలోచనలు ఉన్నాయి. అతనికి గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే పిచ్చి. అతని దగ్గర చాలా గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఉన్నాయి. కమల్ హాసన్ సర్ ని లోకేశ్ కనగరాజ్ ఎంత మాస్ గా చూపించాడో విశ్వక్ కూడా హీరోలని అలా చూపించగలడు. విశ్వక్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తే లోకేశ్ కనగరాజ్ లా సక్సెస్ అవుతాడు. నాకు కూడా దర్శకత్వం అంటే ఇష్టం ఉంది. కానీ ఇప్పట్లో చేయను. నేను చాలా కథలు విశ్వక్ కి చెప్తాను, విశ్వక్ కూడా నాకు చాలా కథలు చెప్తూ ఉంటాడు అని తెలిపింది. మరి భవిష్యత్తులో విశ్వక్ సేన్ దర్శకుడిగా సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.