హీరోయిన్లందరికీ అందం ఉంటుంది. కానీ అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుంది. అలా అదృష్టం తలుపుతట్టినప్పుడు వెంటనే అందుకోవాలి. ఇక్కడో హీరోయిన్ కు అలానే అదృష్టం తలుపుతట్టింది. ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పటివరకు చిన్న హీరోయిన్ గా చలామణి అవుతున్న ఆ ముద్దుగుమ్మ, మెగాస్టార్ మూవీతో బిగ్ లీగ్ లోకి ఎంటర్ కాబోతోంది. ఆ హీరోయిన్ పేరు నివేత పెతురాజ్.
తెలుగులో బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో, రెడ్, చిత్రలహరి లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది నివేత పెతురాజ్. అయితే ఆమె పెద్ద హీరోల సరసన ఇప్పటివరకు నటించలేదు. ఇన్నాళ్లకు ఆమెకు అవకాశం దక్కింది. చిరంజీవి-దర్శకుడు బాబి కాంబోలో రాబోతున్న సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా ఎంపికైంది.
ఈ సినిమాలో శృతిహాసన్ ను మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్ గా నివేతను తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటించబోతున్నాడు. అతడికి జోడీగా నివేత పెతురాజ్ ను తీసుకున్నారు.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ముంబయిలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబోలో కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిరంజీవి-రవితేజ కాంబినేషన్ లో బాబి దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.