నాగపూర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న కంటైనర్ పై దుండగులు దాడిచేసారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఆవల జాతీయ రహదారి వద్ద హల్దీరామ్ ఫుడ్ కంటైనర్ ని ఏడుగురు హైజాక్ చేసారు.
డ్రైవర్ను బెదిరించి, కిడ్నాప్ చేసి తమ కారులో ఎక్కించుకొని అతనిపై దాడి చేస్తూ.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు తీసుకెళ్లారు. అనంతరం డ్రైవర్పై కత్తులు, రాళ్లతో దాడికి చేశారు. డ్రైవర్తో పాటు కంటైనర్ని సైతం అక్కడకి తీసుకెళ్లి అందులోని సరుకులను దొంగలు ఖాళీ చేశారు.
అనంతరం గాయాలతో ఉన్న డ్రైవర్ని కంటైనర్ దగ్గర వదిలేసి పరారయ్యారు. బాధితుడు 100కు డయల్ చేయగా బాల్కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దారి దోపిడీపై కేసు నమోదు చేశారు.
దొంగల దాడిలో గాయపడిన డ్రైవర్‌కు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దోపిడీ చేసిన సరుకు 5 లక్షలు ఉంటుందని చెప్పుకొచ్చాడు డ్రైవర్.
ఇలా 80 కిలోమీటర్ల దూరం వచ్చాకా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారి పైనే గ్రామ సర్వీస్ రోడ్డులో కంటైనర్ వాహనంతో పాటు అతనిని తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వదిలి వెళ్లారని తెలిపాడు. దోపిడీదారులను వెతికి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.