నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాప్ ఉదంతాన్ని ఛేదించిన నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులు.. బాలుడిని అపహరించిన ఇద్దరు మహిళల నుంచి చిన్నారిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.
నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మహిళ.. ఈ నెల 6న ఉదయం ఆర్యనగర్ లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద భిక్షాటన చేస్తూ తిరుగుతోంది. అదే సమయంలో మరో ఇద్దరు మహిళలు ఆమె వద్దకు వచ్చి మాట కలిపి మచ్చిక చేసుకున్నారు. వారి వద్ద ఉన్న పాత బట్టలు ఇచ్చారు. కాసేపు పసికందును ఎత్తుకుంటానని చెప్పిన మహిళ.. బాబును చేతుల్లోకి తీసుకుని బాధితురాలితో పాటు ముందుకు నడిచింది.
కాసేపటికి మరికొన్ని దుస్తులు తీసుకువస్తానని నమ్మించి.. ఆ ఇద్దరూ బాలుడిని తీసుకొని వెళ్లిపోయారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన ఆ తల్లి స్థానిక పోలీస్స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆర్యనగర్ లో పసికందుతో ఉన్న ఇద్దరు మహిళలు.. పోలీసులను చూసి తమ వద్ద ఉన్న బాబును బ్యాగులో దాచారు.
అనుమానం వచ్చిన పోలీసులు.. బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో ఉన్న పసికందును గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బిడ్డను విలేకరుల సమక్షంలో క్షేమంగా తల్లికి అప్పగించారు. చిన్నారి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు ఏసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. అపహరించిన ఇద్దరు మహిళల సైతం భిక్షాటన చేస్తారని ఆయన స్పష్టం చేశారు.