*అసలేం జరిగింది:
ఢిల్లీ నిజాముద్దీన్ లో ఈ నెలలో ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం జమాత్ ప్రధాన కార్యాలయంలో జరిగింది.దీనికి విదేశాల నుండి, భారతదేశం నుండి వేల మంది అనుచరులు హజరయ్యారు.దాదాపు 2 వేలకు పైగా సభ్యులు ఆ కార్యాలయం లో ఉన్నారని, ఇందులో దాదాపు 300 మంది దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఇందులో ఇరాన్ , ఇండోనేషియా కు సంబంధించిన 250 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. వీరిలో చాలా మందికి అప్పటికే కరోనా వైరస్ సోకింది. అదే కార్యక్రమంలో మన దేశానికి చెందిన వారు కూడా పాల్గొనడంతో వైరస్ చాలా మందికి సోకినట్టు తాజాగా వస్తున్న కేసుల ద్వారా అర్థమవుతోంది. వీరంతా సామూహిక ప్రయాణాలు చేయడం, స్వస్థలాలకు చేరుకొని మరికొంత మందిని కలవడం వైరస్ తీవ్రతని పెంచుతోంది. ప్రస్తుతం జమాత్ కార్యాలయాన్ని సీజ్ చేశారు.
*తెలుగు రాష్ట్రాలు విల విల:
తెలుగు రాష్ట్రాల జిల్లాల నుండి ఎంత మంది నిజాముద్దీన్
వెళ్లి వచ్చారో సరైన లెక్కలు లేవు.
వెళ్ళిన వారు స్వచ్చందంగా బయటకు వచ్చి చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు.ఇప్పటికే తెలంగాణలో ఢిల్లీ కి వెళ్లొచ్చి న 6 గురు చనిపోయారు.చాలా మంది ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.తెలంగాణ అన్ని జిల్లాల నుండి ఢిల్లీ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుండి 700 లకు పైగా ఢిల్లీ వెళ్లినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఇవాళ ఒక్కరోజే 17 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే. ఏపి లో మొత్తం కేసుల సంఖ్య 40కి చేరుకుంది. ఇందులో 85 మంది ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు.ఒక్క చీరాల నుండే 45 మంది వెళ్లినట్లు సమాచారం.
*తమిళనాడు లోనూ ఇదే పరిస్థితి:
జమాత్ అనుచరులతో ముడిపడి ఉన్న ఈ వ్యాధి యొక్క మరొక హాట్ స్పాట్ తమిళనాడు గా చెప్పొచ్చు.కేవలం సోమవారం ఒక్కరోజే 38 కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలా కేసులు నిజాముద్దీన్ కు సంబంధం ఉన్నవే.980 మంది తమిళనాడు నుండి ఢిల్లీ కి వెళ్లినట్టు తెలుస్తోంది.
*నిజాముద్దీన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం
మహ్మద్ ప్రవక్త కాలంలో ముస్లింలు ఎలా నివసించాలి అనే విధానాన్ని ప్రతిబింబించడానికి జమాత్ ప్రయత్నిస్తుంది. దీన్ని చాలా పవిత్రంగా ఆ సమాజం భావిస్తుంది.1926 మేవాట్ ప్రావిన్స్ లో ఇస్లామిక్ పండితుడు మౌలానా మహమ్మద్ ఇలియాస్ ప్రారంభించారు.ఇందులో ఉన్న వివిధ దేశాల అనుచరులు వివిధ ప్రాంతాలను సందర్శించి, ముస్లింలుగా వారి పాత్ర మరియు బాధ్యతల గురించి స్థానిక సమాజంలో అవగాహన కల్పిస్తారు. ఈ జమాత్ యొక్క విదేశీ సభ్యులు ఇరాన్, ఇండోనేసియా నుండి ఢిల్లీ కి వచ్చారు. వచ్చిన వారిలో కరోనా ఉండడమే దేశం కొంప ముంచింది.
*రాష్ట్రాల తక్షణ కర్తవ్యం:
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడం కష్ట సాధ్యం అవుతున్న సందర్భంలో లాక్ డౌన్ అమలు చేయడమే పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఢిల్లీకి వెళ్లోస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. ప్రజలు కూడా ఒకవేళ అలాంటి వారి సమాచారం తెలిస్తే అధికారులకు తెలపాలి.ఏమీ కాదులే అని సైలెంట్ గా ఉంటే, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కు దారితీసి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.