ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఇంట్లో కాలు బయట పెట్టకుండా లక్షలు సంపాదించే అవకాశం ఇప్పుడు దొరుకుతోంది. గతంలో లాగా ఉద్యోగాలు అంటూ అవకాశాల కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా లక్షల్లో సంపాదిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో యూట్యూబ్ లో కోట్లలో కూడా సంపాదన వస్తుండడం విశేషం. కేవలం యూట్యూబ్ ద్వారా కోట్ల సంపాదన అంటే నమ్మశక్యం కాని విషయమే. కానీ ఇండియా లోనే టాప్ యూట్యూబర్ సందీప్ మహేశ్వరి గురించి తెలిస్తే ఈ విషయాన్ని నమ్మక తప్పదు.
సాధారణంగా డబ్బు బాగా సంపాదించాలంటే డాక్టర్, ఇంజనీర్, లేదంటే బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలని అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సందీప్ మహేశ్వరి మాత్రం యూట్యూబ్ ద్వారానే భారీగా సంపాదిస్తూ ఇండియాలో నెంబర్ వన్ యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు. సందీప్ మహేశ్వరి యూట్యూబ్ ద్వారా 3 కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. సందీప్ మహేశ్వరి ఒక మోటివేషనల్ స్పీకర్. ఆయన యూట్యూబ్ ఛానల్ కు 21 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. 2000 సంవత్సరంలో సందీప్ మహేశ్వరి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించాడు.
ఆ తర్వాత ఆయన దృష్టి యూట్యూబ్ వైపు మళ్ళింది. ప్రస్తుతం యూట్యూబ్ లో సందీప్ మహేశ్వరి ఏడాదికి మూడు కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. ఇక ఈ యంగ్ యూట్యూబర్ ఇమేజెస్ బజార్. కామ్ అనే సంస్థకి సీఈవో, ఫౌండర్. ఇందులో స్టాక్ ఫొటోస్ ఉంటాయి. ఈ సైట్ లో లక్షకు పైగా భారతీయ మోడల్స్ ఫోటోలు ఉన్నాయి. సందీప్ చిన్న వయసులోనే తన సృజనాత్మక ఆలోచనలతో యూత్ కు ఆదర్శంగా నిలిచాడు. ఈ యంగ్ యూట్యూబర్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2013, యంగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డ్, స్టార్ యూత్ అచీవర్ అవార్డు, పయనీర్ ఆఫ్ టుమారో అనే అవార్డును గెలుచుకున్నాడు.