ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ 9 మంది విపక్ష నేతలు ప్రధాని మోడీకి సుదీర్ఘమైన లేఖ రాశారు. విపక్షాలను వేధించేందుకు కేంద్రం ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగంచేస్తోందని వారు ఆరోపించారు. సిసోడియా అరెస్టు దేశవ్యాప్త నిరసనలకు దారి తీసిందని, ఢిల్లీ స్కూలు విద్యారంగ ప్రగతికి ఆయన ఎంతో కృషి చేశారని, రాజకీయ కక్షలో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని వారు పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా వీరంతా తమ లేఖలో ..దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని, విపక్షాలపై ఈ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం, బీజేపీలో చేరగానే ఆ కేసులను నీరు గార్చడం జరుగుతోందని దుయ్యబట్టారు. 2014 నుంచి మీ ప్రభుత్వ హయాంలో కీలక రాజకీయ నేతలపై కేసులు పెట్టడం, వారిని వేధించడం పరిపాటిగా మారిందన్నారు.
బీజేపీలో చేరిన వెంటనే కొందరు నేతలపై కేసులను నీరు గార్చడం జరుగుతోందన్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ మాజీ నేత, అసోం సీఎం హేమంత బిస్వా శర్మ ఉదంతాన్ని వారు ప్రస్తావించారు. 2014-15 లో శారదా చిట్ ఫండ్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సిబిఐ ఆయనపై దర్యాప్తు జరిపాయని, కానీ ఆయన బీజేపీలో చేరగానే ఈ కేసు ముందుకు సాగలేదన్నారు. అలాగే బెంగాల్ లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో సువెందు అధికారి, ముకుల్ రాయ్ లపై ఈడీ, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసినా వారు బీజేపీ నేతలయ్యాక ఇక ఆ కేసులు మూలన పడ్డాయన్నారు. మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణే వ్యవహారాన్ని కూడా ఈ నేతలు గుర్తు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, సంజయ్ రౌత్, ఆజం ఖాన్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్, అభిషేక్ బెనర్జీ తదితరుల పేర్లను సైతం ఈ లేఖలో ప్రస్తావించారు.
గవర్నర్ల వ్యవస్థను మీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలను పరిపాలన చేయకుండా అడ్డుకోవడం జరుగుతోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల గవర్నర్లతో సహా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంశాన్ని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ లేఖపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంతకాలు చేశారు.