చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించారు. రైతులు చేపడుతున్న దీక్షకు మద్దతు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం మూడవ టీఎంసీ తరలింపు కోసం చేస్తున్న భూ సేకరణ కమీషన్ల కోసమే అని ఆరోపించారు. దానిని తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం పేరిట కమీషన్ల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.
అన్ని వేళలా రైతుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును పక్కనపెట్టి.. కమీషన్ల కోసం 1.20 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించారు. 12 నెలల పాటు నీరు అందుబాటులో ఉంటే.. అదనపు టీఎంసీల అవసరం ఏముందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు.
అవినీతి కేసుల్లో కేసీఆర్ ను జైల్లో పెడతామని తరచూ మాట్లాడే బండి సంజయ్ కి.. కాళేశ్వరం పేరిట దోచుకున్న రూ. వేల కోట్ల అవినీతి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. అదనపు టీఎంసీ కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ జరుగుతుంటే బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ఆరోపించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని మండిపడ్డారు.