కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్‌తో పొత్తనే మాటే ఉండదని, ఆ పార్టీతో పొత్తు తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంటకో మాట మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. వెంకటరెడ్డి పొద్దున ఒక మాట, సాయంత్రం మరో మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అనేది బలమైన, తెలంగాణ ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి స్టాండర్డ్స్ లేని వ్యక్తి అని, ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో చేసిన అభివృద్ధి గురించి కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంబర్‌పేటలో జరిగిన అభివృద్ధిపై అంబర్ పేట ఎమ్మెల్యే సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు.
20 ఏండ్లుగా అంబర్ పేట ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి ఉన్నారని ఆయన అన్నారు. అభివృద్ధిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమని, కిషన్ రెడ్డి సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ లోకి ఈటల వస్తారా? లేదా? అనే విషయం ఆయనకే తెలియాలన్నారు.
తెలంగాణలో ఎవరిపై ఆధారపడి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పరచదన్నారు. బీఆర్ఎస్ కు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉందన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి సీఎం జగన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారుు కానీ తమ సెక్రటేరియట్ ప్రారంభానికి అనుమతి ఇవ్వలేదన్నారు.
కేంద్రంలోని ప్రభుత్వం వ్యవస్థను ఎలా నడుపుతోందో దేశం అంతా చూస్తోందని ఆయన అన్నారు. సెక్రెటేరియట్ నిర్మాణాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని తెలిపారు. సెక్రెటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్‌లో వారందరికీ తెలుస్తుందన్నారు.