– ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులపై నో ఆడిటింగ్
– 4 వేల కోట్ల సీడీపీ పనులు నామినేషన్ ద్వారానే!
– లెక్కలు లేకుండా చేయడంలో అవినీతి
– పనుల్లో నాణ్యత కరువు.. రోడ్డు వేయకుండానే నిధులు
– తాజా బడ్జెట్ లో 10 వేల కోట్ల స్పెషల్ ఫండ్స్
క్రైంబ్యూరో, తొలివెలుగు:నియోజవర్గ అభివృద్ది కోసం కేటాయించే నిధుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 9 ఏళ్ళుగా ఆడిటింగ్ చేయించడం లేదు. 160 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీడీపీ ఫండ్స్ కింద 4 వేల కోట్లు ఖర్చు చేశారు. వీటి ఖర్చులపై విధి విధానాలు అమలు కావడం లేదు. దీంతో పెద్దఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సభ్యులు సూచించిన ఫండ్స్ పై టెండర్ల ద్వారా చేయాలి. కానీ, ఒకే పనిని 5 లక్షల లోపు వర్క్ అంటూ కేటాయిస్తూ.. నామినేషన్ పద్దతిలో ఇస్తున్నారు. ఈ విధానంతో పనుల్లో నాణ్యత ఉండటం లేదు. అవినీతి భారీగా పెరిగిపోతోంది. ఈ పనులపై 9 సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగలేదంటే ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటోంది.
10 వేల కోట్లలో వాళ్లకే ఎక్కవ నిధులు
ఈసారి బడ్జెట్ లో సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ అంటూ 10 వేల కోట్లు కేటాయించారు. ఇలాంటి కేటాయింపులు 90 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇందులో భారీగా ఎమ్మెల్యేల కోరిక మేరకు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని కేటాయించేస్తున్నారు. వీటన్నింటినికీ సరిగ్గా లెక్కలు ఉండడం లేదు. ఇప్పుడైనా ఆడిట్ చేయాలని అంటోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. లేకపోతే అనుమానాలకు తావిచ్చినట్టేనని చెబుతోంది.
రోడ్లకే ఎక్కువ ప్రాధాన్యత
రోడ్లు వేయడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. రోడ్డు బాగున్నా దాని పైనే వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసలు రోడ్డు వేయకుండానే బిల్లులు లేపేశారని ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిపై లెక్కలు తేలాలంటే ఆడిట్ జరగాలి. లేదా ఎక్కడెక్కడ పనులు చేశారో వాటి నాణ్యతపై దర్యాప్తు జరపాలనే డిమాండ్ పెరుగుతోంది.