హీరోలు బాలకృష్ణ, రవితేజపై దాదాపు 3 రోజుల నుంచి ఓ గాసిప్ నడుస్తోంది. వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది దాని సారాంశం. అది దాదాపు నిజమే అనే అభిప్రాయానికి అంతా వచ్చేశారు. ఎందుకంటే, కథనాలు ఆ రేంజ్ లో వచ్చాయి మరి. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. బాలయ్య సినిమాలో రవితేజ లేడని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు అనీల్ రావిపూడి.
సింహం సింగిల్ గా వస్తుందన్నట్టు బాలయ్య సినిమాలో బాలయ్య మాత్రమే కనిపిస్తాడని చెప్పేశాడు రావిపూడి. అయితే అంతకుమించి స్పందించడానికి ఆయన నిరాకరించాడు. ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్నానని, ఆ మూవీ విడుదలైన తర్వాత మాత్రమే బాలయ్య సినిమాపై మరిన్ని వివరాలు బయటపెడతానని తెలిపాడు. ప్రస్తుతానికి రవితేజ మేటర్ పై మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చాడు.
రీసెంట్ గా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి అంగీకరించాడు రవితేజ. అదే చిరంజీవి సినిమా. బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చేస్తున్న ఓ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. అతడికి అందులో హీరోయిన్ కూడా ఉంది. చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ రాజా సరసన నివేత పెతురాజ్ హీరోయిన్.
చిరంజీవి సినిమాలో రవితేజ నటిస్తున్నాడు కాబట్టి, బాలయ్య సినిమాలో కూడా అతడు నటించబోతున్నాడంటూ తెగ ప్రచారం చేశారు కొతంమంది. పైగా అనీల్ రావిపూడి, రవితేజ మంచి స్నేహితులు కాబట్టి, ఈ ఊహాగానాలకు మరింత ఊతం దొరికింది. అయితే ఇదంతా ఉత్తిదేనని స్వయంగా అనీల్ రావిపూడి ప్రకటించాడు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు.