పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వివాదంపై ఇద్దరు ప్రముఖుల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సంజయ్ ఝా, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ. మోహన్ దాస్ పాయ్.. ఒకరికొకరు వాదులాడుకున్నంత పని చేశారు. అదానీ అంశంపై ప్రధాని మోడీ స్పందించడం లేదని, దేశంలోని స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయని, మోడీ ఎప్పుడు దీనిపై మాట్లాడుతారని సంజయ్ ఝా ట్వీట్ చేశారు.
ప్రపంచంలో అత్యంత ధనికుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ కేవలం కొన్ని వారాల్లో 38 వ స్థానానికి దిగజారారని. కానీ దీనిపై కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. దీనిపై మోహన్ దాస్ పాయ్.. అదానీ అంశాన్ని రాధ్ధాంతం చేయరాదని, ఎదుగుదల, తగ్గుదల అన్నది సర్వ సాధారణమని కౌంటరిచ్చారు. దీనిపై సెబీ దర్యాప్తు జరుపుతోందని, మార్కెట్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో సార్లు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
సెబీ రిపోర్టు వచ్చేవరకు వేచి ఉండాలన్నారు. ఇక్కడ ఎవరి ఆత్మసాక్షీ అమ్ముడు పోలేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీనిపై సంజయ్ ఝా.. మీరు భయపడిపోయినట్టు కనిపిస్తున్నారని, మీ మోరల్స్.. నైతిక విలువలు ఎలాస్టిక్స్ లా సాగుతున్నాయని ఆరోపించారు.
ఇక మోహన్ దాస్ పాయ్.. మీ మెదడు పని చేసేలా వ్యవహరించాలని, అదానీ వివాదంలో సీబీతో బాటు ఇతర రెగ్యులేటర్లు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయాన్నీ గమనించాలని అన్నారు. అదానీ అంశం మీద విపక్షాలు నాడు పార్లమెంటులో కూడా పెద్దఎత్తున రభసకు దిగాయి.