జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో లేదా వజూఖానా కొలనులోని శివలింగాన్ని కార్బన్ డేటింగ్ చేయాలన్న భక్తుల పిటిషన్ ని వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. గత మే 16 న ఈ మసీదు కాంప్లెక్సులో సర్వే నిర్వహిస్తుండగా ఈ’ శివలింగం’ కనబడిందని, దీనికి కార్బన్ డేటింగ్ తో బాటు శాస్త్రీయమైన ఇతర పరీక్షలు చేయాలని హిందూ సంస్థ తరఫున భక్తులు కోరారు. ఈ మేరకు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పురావస్తు ప్రాధాన్యమైన ఓ వస్తువు ఏ నాటిదన్న విషయాన్ని నిర్ధారించేందుకు శాస్త్రీయంగా జరిపే పరీక్షను కార్బన్ డేటింగ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరీక్షను జ్ఞానవాపి మసీదు కమిటీ వ్యతిరేకించింది.
వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయం సమీపంలోనే జ్ఞానవాపి మసీదు ఉంది, గతంలో హిందూ ఆలయం ఉన్న చోట మొఘలుల చక్రవర్తి ఔరంగజీబ్ ఆదేశాలపై దాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి.
ఈ మసీదులోని వజూఖానాలో కనుగొన్న శిలాకృతి శివలింగమేనని హిందూ సంఘాలు అంటున్నాయి. అయితే పూర్తిగా దీన్ని నిర్ధారించుకునేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడి మసీదు కమిటీ దీన్ని వ్యతిరేకిస్తోంది. తమ డిమాండును వారణాసి కోర్టు జడ్జి తిరస్కరించారని, ఆర్డర్ కాపీ కోసం వెయిట్ చేస్తున్నామని హిందూ సంస్థ తరఫు లాయర్ మదన్ మోహన్ యాదవ్ తెలిపారు.
అవసరమైతే దీనిపై హైకోర్టుకెక్కుతామని ఆయన చెప్పారు. శివలింగం కనబడిందని చెబుతున్న స్థలాన్ని సీల్ చేయాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశించిందని.. అందువల్ల ఈ పిటిషన్ ని తిరస్కరిస్తున్నామని జడ్జి ఏకే. విశ్వేశ స్పష్టం చేశారు. ఈ కారణంగా దీని సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ని అనుమతించడం లేదన్నారు.